Jagathguru Bhodalu Vol-4        Chapters        Last Page

మన మతానికి లక్ష్యం

మన దేశంలో ఏన్నో మతాలున్నవి. శైవసిద్ధాతమొకటి. వైష్ణవుల పాంచరాత్ర మొకటి. మాధ్వసిద్ధాంతమొకటి.ఇట్లు పరస్పర వైరుధ్యం ఉన్నట్లుకన్పించేసిద్ధాంతాలూ మతాలూ ఏన్నో ఉన్నవి. మరి చూడబోతే ఇవన్నీ హిందూ మతానికి చెందినవే. వీనిలో ఏది గొప్ప, ఏది చిన్న అన్న విషయం కాదు ప్రస్తుతం. పోగా హిందూమతమంటే ఏమి? ఇన్నిసిద్ధాంతాలకున్నూ ఉమ్మడియైన విషయమేమిటి? అన్నది మనం తెలుసుకోవాలి. ఎవరిని అడిగినా, సరియైన జవాబు రావడం కష్టం. చక్కనిపాండిత్యమున్న వారుకూడా సిద్ధాంతాలలోని వ్యత్యాసాలనే మరింత ఎక్కువచేస్తున్నారు. వీని కన్నిటికీ సామాన్యమైన ఒకే లక్ష్యం ఉంటేకాని, హైందవాన్ని ఒక్క మతం అని చెప్పలేము. మరి ఆ లక్ష్యం ఏమిటి?

అనుదినం కొందరు రామాయణ పారాయణ చేస్తుంటారు. పారాయణ ప్రారంభమందూ అవసానమందూ ఈక్రింది శ్లోకం పఠిస్తారు.

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం

న్యాయ్యేన మార్గేణ మహింమహీశాః,

గోబ్రాహ్మణభ్యః శుభ మస్తు నిత్యం

లోకాః సమస్తాః సుఖినో భవంతు||

జనులు సౌఖ్యంగా ఉందురుగాక. రాజులు భూమిని న్యాయమార్గంలో పరిపాలింతురుగాక. పశువులకూ, బ్రాహ్మణులకూ మంగళమగునుగాక. సమస్తలోకాలూ సుఖంగాఉండునుగాక అని దీని అర్థం.

ఈశ్లోకంలో జనులనూ రాజులనూ గూర్చి ఉమ్మడిగా చెప్పి. తర్వాత ప్రత్యేకంగా గోబ్రాహ్మణులనుగూర్చి చెప్పబడినది. ఈ బ్రాహ్మాణప్రశంస ప్రత్యేకంగా దేనికి వచ్చింది? వీళ్ళు లోకంలోవారే కాదా? మరి వీరి విశిష్టత ఏమిటి? బ్రాహ్మణులకు మంగళమగుగాక అనటం బ్రాహ్మణపక్షపాతంకాదా? ఇట్లు చెప్పవలసిన అవసర మేమిటి.

మధురానగరం ఒకప్పుడు కూన్‌ పాండ్యన్‌ అన్న రాజు పాలించేవాడు. అతడు శ్రమణుల మతంలో కలసిపోయాడు. శ్రమణమతం స్వీకరించి అతడు 'ఎవ్వరూ విభూతి పూయరాదు. రుద్రాక్షలు వేసుకోరాదు' అన్న కట్టడిచేశాడు. రాజుగారి భార్య, రాజుగారిమంత్రీ పరమశివ-ఏకాంతభక్తులు. ఐనప్పటికిన్నీ రాజాజ్ఞ ఏవిధంగా అతిక్రమించడం? రాజు మళ్ళా బుద్ధిమారి శైవమార్గంలోకి ఎప్పుడు వస్తాడా అని బాధపడేవారు. ఇతడు మళ్ళా శివారాధన ఎప్పుడు చేయబోతాడా అని కలవరపడేవారు. ఇట్లా ఉన్నప్పుడు ఆ రాజ్యానికి జ్ఞానసంబంధులు విజయంచేశారు. వారు శైవాచార్యులు అనబడే నలువురిలో ఒక్కరు. సుబ్రహ్మణ్యస్వామి అపరావతారం. తమ భక్తకోటితో ఒక్కొక్క క్షేత్రమే దర్శిస్తూ మధురానగరానికి వచ్చారు. ఇట్టి శుభసమయానికి ప్రతీక్షిస్తూ కూచున్న రాజమంత్రీ, రాజపత్నీ ఈ అవకాశాన్ని జారవిడుచుకోలేదు. వారు సంబంధులకు వార్తపంపి, ఎట్లాగైనా రాజుగారి బుద్ధినిమార్చవలెనని ప్రాధేయపడ్డారు.

సంబంధులు మధురలో ఒకచోట విడిదిచేశారు. వారి రాక ఇష్టపడని శ్రమణులు, వారి విడిదికి అగ్గిపెట్టారు. దీనిని గమనించి సంబంధులు 'ఈ మంట ఇచ్చటనుండి, రాజుగారి దేహంలో ప్రవేశించనీ' అని ఈశ్వరుణ్ణి ప్రార్థించగా, ఈశ్వర సంకల్పం మేరకు రాజుకు ఉగ్రమైన జ్వరంవచ్చింది. శ్రమణులు ఎంత శ్రమించినా రాజుగారి జ్వరం తగ్గలేదు. అప్పుడు మంత్రి రాజుగారికి సంబంధుల గొప్పతనం వర్ణించి, వారిని పిలిపిస్తే జ్వరం ఆగిపోతుందని నచ్చజెప్పారు. లోకంలో ఎంత పిడివాదం చేసేవాడయినా, వ్యాధి పరాక్రమం భరించలేని సమయంలో, తన పిడివాదాన్ని కొంతకొంత మార్చుకోవడం వాడుకే. అట్లే వ్యాధి తీవ్రత తాళుకోలేని కూన్‌ పాండ్యుడుకూడా, రుద్రాక్షలవారినీ బూడిద బుస్సన్నలనూ చూడనన్న తన పట్టును కొంత సడలించి సంబంధులను చూడడానికి సమ్మతించాడు. మంత్రి పరమానందం పొంది సంబంధులను మహా గొప్పగా ఆహ్వానించాడు.

రాజసమక్షంలో శ్రమణులకున్నూ జ్ఞానసంబంధులకున్నూ వాగ్వాదం ఆరంభ##మైంది. సంబంధులవారు శ్రమణులను చూచి ''మీరు రాజుగారి కుడిభాగంలోని జ్వరం పోగొట్టండి. నేను ఎడమవైపు పోగొటతాను. కానివ్వండి, మీ మంత్రశక్తిని చూపండి అని అన్నారు. మీరు పోగొట్టలేకపోతే మీరోడిపోయినట్లు; నేను పోగొట్టలేకపోతే నేనోడిపోయినట్లు'' అని పన్నిదంచరచి సంబంధులవారు పదికంపాడి రాజుగారి ఎడమభాగానికి విభూతి పూశారు. అంతటితో అభాగములో జ్వరం నిలిచిపోయింది. కాని శ్రమణులు ఎంత శ్రమించినా పని జరగకపోయింది. అంతటితో శ్రమణులు 'మీరుకుడితట్టుబాగుచేయండి; మేము ఎడమతట్టు బాగుచేస్తాం' అనిమళ్ళా సంబంధులతో పందెం వేశారు. సంబంధులవారు సరే అనగా, కుదిరిన ఎడమభాగంలోనికి జ్వరం పునఃప్రవేశం చేసింది. కుడిభాగంలో జ్వరం పోయింది.

రాజుగారి జ్వరం సామాన్యమైనది కాదు. అది ఈశ్వర సంకల్పమూలంగా వచ్చిన జ్వరం. అందుచేతనే శ్రమణులకు చెందిన రాజుగారి శరీరభాగం మళ్ళా జ్వరగ్రస్తమైంది. శ్రమణుల చేతకానితనం రూఢి ఐనపిదప సంబంధులు రాజుగారిపై జాలితలచి జ్వరం పూర్తిగా నిమ్మళించేటట్టు చేశారు.

అప్పటికీ శ్రమణులు తమ వోటమిని ఒప్పుకోలేదు. రాజుగారికిన్నీ పూర్ణమైన నమ్మక మేర్పడలేదు. వాదం మళ్ళా ప్రారంభమయింది. సంబంధులు వాదాని కుపక్రమించేముందు శివాలయానికి వెళ్ళి 'ఈ వేదనిందనూ, యాగనిందనూ చేసే శ్రమణులను జయించి నీ ప్రతిభ సర్వవ్యాప్తమయ్యేటట్లు అనుగ్రహించు' అని ఈశ్వరుణ్ణి వేడుకొన్నారు.

వాదం మళ్ళా ప్రారంభ##మైంది. సంబంధులవారన్నారు; ''మీసిద్ధాంతాన్ని ఒక తాటాకుమీద వ్రాసి వైఘానదిలో వేయండి. నా సిద్ధాంతాన్ని వ్రాసి నేనూ వేస్తాను. ఇందులో ఏది ప్రవాహానికి ఎదురీత ఈదగలదో అదే సత్యమైనసిద్ధాంతం'' అని. ఇందులోనూ సంబంధులవారిదే జయం. ఐనప్పటికీ శ్రమణులు ఒప్పుకోలేదు. అదేరీతిని తాటాకులమీద తమతమ సిద్ధాంతాలు వ్రాసి పరీక్షార్థం అగ్నిలో వేశారు. శ్రమణుల తాళపత్రం అగ్నిలో దగ్ధమైపోయింది. ఈ క్రింది అర్థం కల తమ సిద్ధాంతాన్ని ఆ తాటాకుమీద వ్రాశారు.

''బ్రాహ్మణుల సౌఖ్యంగా వర్థిల్లాలి. దేవతలూ, పశువులూ సుఖంగా ఉండాలి చల్లగా వం్షాలు కురియాలి. రాజు నీతితప్పకుండా ఏలాలి. ఎవ్వరికిన్నీ చెరుపు అనేది ఉండరాదు. లోకమంతా 'హరహర మహాదేవ' శబ్దంతో ఘోషించాలి. లోకంలో దుఃఖమన్నమాట ఉండరాదు.''

శైవమతం ఎట్లా ఉన్నప్పటికిన్నీ పరీక్షలో నెగ్గిన సంబంధులవారి సిద్ధాంతంలో, గోబ్రాహ్మణుల ప్రత్యేక ప్రశంస మనం గమనించాలి. అంతేకాక ఆయన దేవతలక్షేమం కూడా కోరారు. ఈ విధంగానే మనకు మరొక్కశ్లోక మున్నది. -

నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణ హితాయ చ,

జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమోనమః||''

- శాంతిపర్వము.

బ్రాహ్మణులకున్నూ గోవులకున్నూ హితమొనర్చే కృష్ణునికి నమస్కారం. దీనిలోనూ బ్రాహ్మణప్రశంస ఉన్నది. దీనికి కారణమేమి?

లోకంలో ఏవిధమైన ప్రశ్నరానీ, గీతాశాస్త్రం తరచి చూచామంటే, ఆ ప్రశ్నలకు ఉత్తరాలు మనకు కనిపిస్తవి.

''సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః,

పార్థోవత్చః సుధీర్‌ భోక్తా దుగ్ధం గీతామృతం మహత్‌||''

సర్వోపనిషత్తులు ధేనువులు. వానిని పితికేవాడుగోపాలనందనుడు శ్రీకృష్ణుడు. లేగ అర్జునుడు. ఆ ధేనువులిచ్చిన పాలు గీతామృతం. ఆ అమృతం తాగేవారు పండితులు.

ఒక గొల్లడు పాలు పితుకవలెనంటే దూడకూడా ఉండాలి. పితికిన పాలు దూడకేకాక ఇతరులకూ ఉపయోగపడుతున్నవి. ఆ గీతామృతం, భోక్తలైన సుధీజనులకు ఏవిధమైన సందేహ మున్నప్పటికీ తీరుస్తున్నది. ఎవరు ఏ ప్రశ్న అడిగినా ప్రత్యుత్తరం దానిలో ఉంటున్నది. అనేక గ్రంథాలున్నప్పటికిన్నీ నేను గీతను చెప్పడాని కొక కారణం ఉన్నది. అదేమనగా గీతలోచెప్పబడిన తత్త్వములగూర్చి వివాదమున్నప్పటికిన్నీ గీతాశాస్త్రం ఒక మహాగ్రంథం అని అంగీకరించడములో ఎవరికిన్నీ ఆక్షేపంలేదు. అందుచేతనే నేను వేసిన ప్రశ్నకు ఉత్తరం గీతలో ఉన్నదా అన్న పరిశీలన ఇది. అందులో నా ప్రశ్నకు ప్రత్యుత్తరముంటే మీ రందరూ అంగీకరిస్తారనే ఈ పరిశీలన.

ఈ లోకంలో వసిస్తున్న మన జీవితరీతులు కొద్దిగా గమనింతాం. మనవూరిలో ఒక వస్తువు విశేషంగా ఉత్పత్తి అవుతున్నదంటే దానిని, అది లేనిచోటికి రవాణాచేస్తున్నాం. అదేవిధంగా మనకు ఒక వస్తువు రావలసివుంటే, అది ఎక్కడ విస్తారంగా ఉత్పత్తి అవుతున్నదో అచ్చటనుండి దిగుమతి చేసుకొంటున్నాం. వడ్రంగీ, తాపీపని చేసేవారు-మనకు కొన్ని పనులు చేస్తున్నారు. వారికి కావలసినవాటిని మనము వారికి ఇస్తున్నాము. పశువులకు కసవు వేస్తున్నాం. ఆ కసవు మెసవి, అవి మనకుపాలిస్తున్నవి. రాజ్యాంగానికి పన్నులు కట్టుతున్నాం. ఇట్లు మనం పరిశీలిస్తూ పోతుంటే ప్రపంచమే ఒక పరివర్తన క్రమంలో నడుస్తున్నదని గమనించవచ్చు. ఇట్లే మనము లోకాంతర విషయాలలో కూడా కొన్ని పరివర్తనలను చేస్తున్నాం. ఇంజనీర్లున్నారు. కురిసిన నీటిని అనకట్టలు కట్టి, కాలువలు త్రవ్వి అన్ని చోట్లకూ సమపాళ్ళలో విభాగించకలరు కాని వం్షంమాత్రంసృష్ఠించలేకపోతున్నారు. వం్షంమనకు కావలసివస్తే మనం కొన్ని వస్తువులను దేవలోకానికి పంపాలి. ఈ విషయాన్నే గీత చెప్పుతూంది.

''సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః,

అనేన ప్రసవిష్యధ్వం ఏష వోస్తిష్ట కామధుక్‌||''

''దేవాన్‌ భావయతా నేన తే దేవా భావయంతు వః,

పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యధ||''

- గీత 3 - 10, 11

మొట్టమొదట బ్రహ్మజనులతోపాటు యాగాలుకూడా సృష్టించాడు. అపుడు ఆ జనాన్ని చూచి, ''యాగాలు చేసి మీరు క్షేమమొందండి. ఈ యాగం మీ ఇష్టాలను పూర్తిచేయాలి. ఈ యాగసాహాయ్యంతో మీరు దేవతలను తృప్తినొందించండి. వారు వం్షాతపాదులచే మీకు సౌఖ్యాన్ని క్షేమాన్ని ఆపాదించాలి. ఇట్లా మీరు పరస్పరమూ సహాయం చేసుకొంటూ శ్రేయం పొందాలి'' అని అన్నాడు.

యాగం అన్నది - మంత్రం, దేవత, హవిస్సు అని మూడుస్వరూపాలతో ఉంటుంది. వానిలో మంత్రం బ్రాహ్మణుడు చెప్పాలి. దేవతను మనస్సులో ధ్యానించాలి. హోమానికి కావలసినది ముఖ్యం గోఘృతం. కాని బ్రాహ్మణులు ఈ కాలంలో వేదాధ్యయనం వదలిపెట్టి ఆంగ్ల భాషాభ్యాసం చేస్తున్నారు. కనుక సరియగు ఉచ్చారణలేక మంత్రశుద్ధి లేదు. కర్మానుష్ఠానం సక్రమంగా లేకపోవడంవల్ల వేదాధ్యయనమూ సరిగా జరగటంలేదు. ఆవుపాలు కాఫీలకే చాలడములేదు. అందుచేత శుద్ధమైన నేయి దొరకడంలేదు. ఇందువల్ల ద్రవ్య శుద్ధియున్నూ లేదు.

యాగానికి ముఖ్యమైన మంత్రం ఆధ్యయనం చేయడంవల్ల బ్రాహ్మణున్నీ, హోమద్రవ్యానికి వలసిననేతిని ఇవ్వడంవల్ల ఆవునీ ప్రత్యేకంగా పేర్కొన్నారని మనం గ్రహించవలసి వస్తుంది. యాగఫలరూపమైన ప్రయోజనం బ్రాహ్మణులకూ, గోవులకేకాక లోకంలో అందరికిన్నీ ఉద్దేశింపబడ్డది. యాగాలు చేస్తేనే లోకం క్షేమంగా ఉంటుంది. యాగాలు సక్రమంగా నడవాలంటే గో బ్రాహ్మణులు సౌఖ్యంగా ఉండాలి.

అందుచేత ఈ కాలంలో బ్రాహ్మణులు అధ్యయనం చేయకపోతేపోనీండి; చేసినవారినైనాఅలక్ష్యంగా చూడకుండా ఉండడం ముఖ్యం. హిందూమతంలో పలురకాలైన శాఖలూ, సిద్ధాంతాలూ ఉన్నప్పటికిన్నీ వీటి అన్నిటికీ లక్ష్యం మాత్రమొక్కటే. ఆ లక్ష్యమే ''లోకాః సమస్తాః సుఖినో భవంతు'' అన్న వాక్యంలో అంతర్భూతమై ఉన్నది.


Jagathguru Bhodalu Vol-4        Chapters        Last Page